Asianet News TeluguAsianet News Telugu

వ్యక్తిని ఢీకొట్టి పారిపోతున్న ఆటోను వెంబడించి మృత్యువాత పడిన జర్నలిస్టు

వేగంలో ఎదురుగా ఉన్న రోడ్‌ రోలర్‌కు బలంగా ఢీకొనడంతో విజయ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగాయి. అలాగే వాహనంపై ఉన్న అతని బంధువుకు కూడా గాయాలయ్యాయి. విజయ్‌ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోవడంతో స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Journalist Vijay Kumar killed in road accident
Author
Hyderabad, First Published Apr 28, 2019, 8:57 AM IST

హైదరాబాద్: ఓ వ్యక్తిని ఢీకొట్టి తప్పించుకొని పారిపోతున్న ఓ ఆటో డ్రైవర్‌ను చేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఓ సీనియర్‌ జర్నలిస్టు మరణించాడు. హైదరాబాదు ముషీరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతానికి చెందిన కె. విజయ్‌ కుమార్‌ (34) దశాబ్ద కాలంగా వివిధ దినపత్రికల్లో పనిచేశారు. 

ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. తన మరదలు వివాహ పనుల కోసం ఈ నెల 24వ తేదీన పరిగికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ ఆటో అతివేగంగా వచ్చి ఓ వ్యక్తిని ఢీకొట్టి అదే వేగంతో వెళ్లపోతుండడాన్ని గమనించాడు. ఆ ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు తన వాహనంపై స్పీడుగా వెళ్తూ ఆటోను వెంబడించాడు.

వేగంలో ఎదురుగా ఉన్న రోడ్‌ రోలర్‌కు బలంగా ఢీకొనడంతో విజయ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగాయి. అలాగే వాహనంపై ఉన్న అతని బంధువుకు కూడా గాయాలయ్యాయి. విజయ్‌ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోవడంతో స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబసభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

ఆరోగ్యం మరింతగా విషమించడంతో 25వ తేదీన కుటుంబసభ్యులు విజయ్‌కుమార్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 27వ తేదీన తెల్లవారుజామున ఆయన మరణించాడు. కుటుంబ సభ్యుల రోదనలను చూపరులను కంటతడి పెట్టించాయి. నాయకులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
 
ఆయన అంత్యక్రియలు బన్సీలాల్‌పేటలోని శ్మశాన వాటికలో శనివారం సాయంత్రం జరిగాయి. అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, బస్తీవాసులు పెద్దఎత్తున్న పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios