హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు కాంగ్రెసు నేత టి. జీవన్ రెడ్డి బాసటగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో భాగంగానే కుట్రకు తెర తీశారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. 

ఈటెల మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ జరపకూడదని తాను అనడం లేదని, విచారణ ఎలా జరుగుతుందో చూడాలని మాత్రమే అంటున్నానని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ నిజాయితీగా ఆస్తులు సంపాదించుకున్నారని ఆయన అన్నారు 2004లో ఈటెల రాజేందర్ ఎన్నికల అఫిడవిట్ ను, కేసీఆర్ కుటుంబ సభ్యుల అఫిడవిట్ ను ప్రస్తుత ఆస్తులతో పోల్చి చూడాలని ఆయన అన్నారు 

అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కలెక్టర్ గా ధర్మారెడ్డి ఏం చేశారని ఆయన అడిగారు. ఈటెల రాజేందర్ భూమి కబ్జాలు చేస్తుంటే తాము అడ్డుకునే ప్రయత్నం చేశామని అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి అసైనీలకు అప్పగించాల్సిన బాధ్యత అధికారులది కాదా అని ఆయన అడిగారు. ఈటెలతో పాటు ఆరోపణలు ఎదుర్కుంటున్న మిగతావారి సంగతేమిటని ఆయన అడిగారు. 

కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, అల్లుడు సంతోష్, కూతురు కవిత అస్తుల విషయాలపై కూడా నిజాలు బయటకు రావాలని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ ఎలాగైనా తిరుగుబాటు చేస్తాడని భావించి, అతనికి కళ్లెం వేయాలని భావించి, మచ్చ రుద్దుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు .నయీం ఆక్రమిత భూములు ఏమయ్యాయని ఆయన అడిగారు. కేసీఆర్ కుట్రపూరిత ధోరణులను బయటపెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన అన్నారు.

మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణల మాటేమిటని ఆయన అడిగారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువు కబ్జా చేశారని నెలల పాటు ఉద్యమించినా స్పందించినవారు లేరని ఆయన అన్నారు. వక్భ్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మీద కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.