పవన్ చేతికి 99 టీవీ, 10టీవీని కొనుగోలు చేసిన నిమ్మగడ్డ
రెండు వామపక్షపార్టీలు తమ వాణిని విన్పించేందుకు ఏర్పాటు చేసుకొన్న రెండు చానెళ్లు ఇతర యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి. సీపీఐ ప్రారంభించిన 99 టీవీ జనసేన నేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. సీపీఏం ప్రారంభించిన 10 టీవీ నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.
హైదరాబాద్:వామపక్షపార్టీలు మీడియాలో తమ గొంతుకు విన్పించుకొనేందుకు ఏర్పాటు చేసుకొన్న రెండు మీడియా చానెళ్లు ఇతర యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి. కొన్ని రోజుల తేడాల్లోనే ఈ రెండు పార్టీలకు చెందిన చానెళ్లను వేర్వేరు యాజమాన్యాల్లోకి వెళ్లాయి. సీపీఐ ప్రారంభించిన 99 టీవీ చానెల్ ను జనసేన పార్టీకి చెందిన నేత తోట చంద్రశేఖర్ కొనుగోలుచేసినట్టు సమాచారం. మరోవైపు సీపీఎం ప్రారంభించిన 10 టీవీని నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.
సీపీఐ ప్రారంభించిన 99 టీవీ కొంత కాలం పాటు బాగానే నడిచినా నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో చానెల్ నిర్వహణ పార్టీకి కష్టంగా మారింది. ఈ సమయంలో చానెల్ ను విక్రయించాలని చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంంలో జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.
ఈ తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ తమ పార్టీ వాణిని విన్పించేందుకు ఓ మీడియా సంస్థ కావాలని భావిస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే జనసేనలో చురుకుగా ఉంటున్న తోట చంద్రశేఖర్ 99 టీవీ చానెల్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. 99 టీవీ చానెల్ ను జనసేన నేత చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. మూడు రోజుల క్రితమే ఈ చానెల్ నిర్వహణ బాధ్యతను చంద్రశేఖర్ తీసుకొన్నట్టు సమాచారం.ఈ చానెల్ ను చంద్రశేఖర్ తీసుకొన్నా దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
గురువారం నాడు కొత్త యాజమాన్యం 99 టీవీ చానెల్ లో పనిచేసే ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 99 టీవీ చానెల్ అతి తక్కువ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
మరోవైపు 10 టీవీ ప్రారంభంలో రేటింగ్ లో దూసుకుపోయింది. కొత్త ఒరవడితో చానెల్ మార్కెట్లోకి వచ్చింది. చానెల్ ప్రారంభించేందుకు సీపీఎం ప్రజల నుండి షేర్స్ రూపంలో డబ్బులను వసూలు చేసింది. చానెల్ ప్రారంభ సమయంలో ఉన్న ఉద్యోగులు లేరు. ఆ తర్వాత చానెల్ నిర్వహణ ఆర్ధికంగా కష్టంగా మారింది. దీంతో పార్టీ నాయకత్వం అతి కష్టమ్మీద చానెల్ నిర్వహిస్తోంది. ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు సర్ధుతున్నారు.
అయితే నిర్వహణ అనేది కష్టంగా మారడంతో చానెల్ ను వదులుకోవాలని సీపీఎం నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు చానెల్ ను విక్రయించారు. వారం రోజుల క్రితమే చానెల్ విక్రయం పూర్తైనట్టుగా చెబుతున్నారు. ఈ చానెల్‌ను నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయమై కొన్ని రోజుల తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఏడాదిపాటు కొనసాగిస్తారని అంటున్నారు.
అయితే టీవీ చానెళ్లను రెండు వామపక్ష పార్టీలు సమర్థవంతంగా నడపలేకపోయాయి. తమ వాణిని వినిపించే పేరుతో చానెళ్లు ఏర్పాటు చేసుకొన్నప్పటికి తుదికంటా ఆ చానెల్స్ ను నడపడంలో ఈ రెండు పార్టీలు కూడ వైఫల్యం చెందాయి. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ కు గతంలో మాటీవీలో భాగస్వామ్యం ఉండేది. మాటీవీని స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది.
అయితే నిమ్మగడ్డ 10 టీవీని కొనుగోలు చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ పట్టిందల్లా బంగారమే అనేది ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ఆయన ప్రారంభించిన ప్రతి వ్యాపారం విజయవపథంలో దూసుకువెళ్లిందని చెబుతారు. 10 టీవీ నిమ్మగడ్డ చేతుల్లోకి వెళ్లడంతో ఉద్యోగులకు ఇక మంచి రోజులే వచ్చాయనే ప్రచారం కూడ లేకపోలేదు.