హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రచించిన మనసినిమాలు.. అనుభవాలు.. చరిత్ర.. పరిణామం పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.    

ఈ సందర్భంగా ప్రపంచాన్ని శాసించే సినిమాలు తెలుగు నుంచి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బాహుబలి లాంటి చిత్రాలు తెలుగు చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిందని అలాగే అంతటి కంటే గొప్ప చిత్రాలు తెలుగు భాష నుంచి వస్తాయన్నారు. 

ఏ ప్రాంతాలకు లేనంత సాహిత్యం తెలుగు భాషకు మాత్రమే ఉందని ఆ గొప్పతనంతో మంచి సినిమాలు వస్తాయని చెప్పుకొచ్చారు. తనను ఇంతటి వాడిని చేసిన కళామ్మతల్లికి తాను ఎప్పుడూ బద్దుడునై ఉంటానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. 

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అభిమాని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనుకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. 

తెలంగాణ తన రక్తంలో ఉంటుందని, తన గుండెల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన తెలంగాణను రాజకీయాల కోసం మాట్లాడనని, తెలంగాణ కోసం మాట్లాడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

ఈ సందర్భంగా జాతీయ అవార్డుకు ఎంపికైన మహానటి సినిమాపై ప్రశంసలు కురిపించారు. మహానటి లాంటి సినిమాలు ఎంతో మందికి ప్రేరణ కలిగించాయనీ స్పష్టం చేశారు. ఒక తరానికి చెందిన వారికి సావిత్రి అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉండేదని ఈ చిత్రం ద్వారా అందరూ తెలుసుకున్నారని తాను భావిస్తున్నట్లు తెలిపారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇకపోతే ఈ కార్యక్రమంలో రచయిత తెలకపల్లి రవితోపాటు పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, తనికెళ్ళ భరణి లాంటి సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

సినిమావాళ్లని తక్కువగా చూడొద్దు.. పవన్ కళ్యాణ్ ముందు పరుచూరి వ్యాఖ్యలు!