హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ సిద్దంగా వుందని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జి వేమూరి శంకర్ గౌడ్ వెల్లడించారు. అయితే మొత్తం డివిజన్లలో కాకుండా తమకు పట్టున్న 45 నుండి 60 డివిజన్లలో అభ్యర్థులను పోటీలో నిలపనున్నామన్నారు. ఈ మేరకు రేపు ఏయే డివిజన్లలో జనసేన ఫోటీ చేయనుందో ప్రకటించడమే కాదు అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనున్నట్లు శంకర్ గౌడ్ వెల్లడించారు.  

''గత రెండు రోజులుగా హైదరాబాద్, ప్రశాసన్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి అశావాహ అభ్యర్థులు వారి యొక్క బయోడేటా సమర్పించిమార్పు కోసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. వీరిలో విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, పట్టభద్రులతో పాటు జనసేన నాయకులు, వీరమహిళలు, క్రియాశీల జనసైనికులు ఉన్నారు. వందలాది అభ్యర్థుల బయోడేటాలు, వారి సామర్థ్యాలను పరిశీలించిన తరువాత దాదాపు 45 నుండి 60 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపేందుకు నిర్ణయించడం జరిగింది'' అంటూ శంకర్ గౌడ్ పేరిట ఓ ప్రకటన విడుదలయ్యింది. 

''శుక్రవారం తుది జాబితాను విడుదల చేయడమే కాకుండా వెంటనే నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం. రాజకీయ విమర్శలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం. గ్రేటర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజల గొంతుగా జనసేన పార్టీని నిలబెట్టేందుకు గ్రేటర్ జనసైనికులందరూ కష్టపడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా'' అంటూ జనసేన తెలంగాణ ఇంచార్జి కోరారు.