హైదరాబాద్‌: హుజూర్ నగర్ నుంచి తాను పోటీ చేస్తానని అంటూ వచ్చిన వార్తలపై తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత కుందూరు జానా రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. 

హుజూర్ నగర్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభకు ఎన్నికయ్యారు. దీంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీంతో హుజూర్ నగర్ సీటును జానా రెడ్డి ఆశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానిపై జానా రెడ్డి స్పందించారు.  

హుజూర్ నగర్ లో గెలిస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది ఏమైనా ఉందా అని జానా రెడ్డి ప్రశ్నించారు. తన స్థాయి నాయకుడు పోటీ చేసి రావడమంటే ప్రభుత్వమైనా ఏర్పాటు చేయాలి, లేదంటే ప్రభుత్వంలో కీలకంగానైనా ఉండాలని ఆయన అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన ఆ విధంగా అన్నారు. 

శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రజలు తిరిగి కాంగ్రెస్‌ వైపునకే మళ్లారని అనిపిస్తోందని అన్నారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2023ఎన్నికల్లో విశ్రాంతి తీసుకోవాలని ఉందని, తప్పక పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆలోచిస్తానని అన్నారు.