హైదరాబాద్: మిర్యాలగూడా సీటుకు కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డి అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. మిర్యాలగూడ సీటును తన కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇవ్వాలని తొలుత ఆయన పార్టీ అధిష్టానంపై పట్టుబట్టారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో దాన్ని విరమించుకున్నారు. 

మిర్యాలగూడ సీటును అధిష్టానం తెలంగాణ జన సమితికి కేటాయించింది. దానికి జానా రెడ్డి మెలిక పెట్టారు. మిర్యాలగుడా నుంచి టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేయాలని ఆయన అడిగారు. ఈ సీటును టిజెఎస్ విద్యాసాగర్ రెడ్డికి కేటాయించినట్లు సమాచారం. తెలంగాణ జెఎసిలో విద్యాసాగర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. 

అయితే, కోదండరామ్ మిర్యాలగుడా నుంచి పోటీ చేయని పక్షంలో ఆ సీటును తనకు సన్నిహితుడైన విజయేందర్ రెడ్డికి కేటాయించాలని జానారెడ్డి పట్టుబడుతున్నారు. విజయేందర్ రెడ్డి టిజెఎస్ టికెట్ ఇవ్వాలనేది ఆయన వాంఛ. విజయేందర్ రెడ్డి ఫిల్మ్ జెఎసి నేత. జానా రెడ్డి వియ్యంకుడి సోదరుడు.