న్యూఢిల్లీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు టాప్ టెన్ పోలీస్ స్టేషన్ల జాబితాలో చోటు దక్కింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ టాప్ టెన్ పోలీస్ స్టేషన్ల జాబితాను గురువారం నాడు విడుదల చేసింది.

ప్రతి రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్లను కేంద్రం ప్రకటిస్తోంది.ఇదే జిల్లాలోని చొప్పదండి పోలీస్ స్టేషన్ 2019లో దేశంలోని టాప్ పోలీస్ స్టేషన్లలో ఏడో స్థానాన్ని దక్కించుకొంది.దేశంలోని పలు పోలీస్ స్టేషన్ల పనితీరును పరిశీలించి  ఈ పది పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు.

ఆస్తి నేరం, మహిళలపై నేరాలు,బలహీనవర్గాలపై నేరాలు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం, గుర్తించని మృతదేహాలను పరిష్కరించడం తదితర వాటి ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్ల షార్ట్ లిస్టింగ్ ర్యాంకింగ్ చేస్తారు.

ప్రతి రాష్ట్రం నుండి 750 పోలీస్ స్టేషన్లలో మూడు పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసి కేంద్ర హోంశాఖకు పంపుతారు.ఈ షార్ట్ లిస్ట్ ఆధారంగా  టాప్ టెన్ 10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తారు.జమ్మికుంట పోలీసు అధికారులను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.