పోలీసులంటే కఠినంగా వుంటారు...ఈ నేరాలు, ఘోరాలను దగ్గరనుండి చూడటంవల్ల వారిలో చాలామందికి మనసు రాయిలా మారిపోతుందని అంటుంటారు. అంతేకాదు సామాన్యులపై ఎప్పుడూ జులుం ప్రదర్శిస్తూ దారుణంగా వ్యవహరిస్తారని వారిపై  అపవాదుంది. కానీ పోలీస్ శాఖలో కూడా మానవత్వమున్న అధికారులున్నారని ఈ పోలీస్ నిరూపించారు. తన ప్రాణాలకు తెగించి  మరీ ఇద్దరు యువకులను కాపాడి శబాష్ అనిపించుకున్నారు. ఇలా తన సాహసోనేత చర్యలతో రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఆ పోలీస్ అధికారి పేరు సుజన్ రెడ్డి.  

కరీంనగర్ జిల్లా జమ్మికుంట సిఐగా సుజన్ రెడ్డియ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం మండలపరిధిలోని  మడిపల్లి గ్రామంలో ఇద్దరు యువకులు చేదబావిలో పడినట్లు  పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ సుజన్ తన సిబ్బందిని తీసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. వారు వెళ్లేవరకు యువకులు ఇంకా అదేబావిలో వున్నారు. బావిలోకి దిగి వారిని కాపాడటానికి గ్రామస్తులు వెనుకడుగు వేశారు. 

బావి చాలా చిన్నదిగా వుండటంతో పాటు లోతు ఎక్కువగా వుంది. దీంతో కిందకి వెళ్లిన కొద్ది గాలి తగ్గి ఊపిరాడటం కష్టంగా వుంటుంది. దీంతో గ్రామస్తులు వెనుకడుగు వేసినా సీఐ సుజన్ సాహసం చేశాడు. తాడు సాయంతో బావిలోకి  దిగి ఊపిరాడక దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయన యువకులిద్దరిని ప్రాణాలతో కాపాడారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సీఐ ఈ పని చేశాడు. బావిలోకి దిగే క్రమంలో సీఐకి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో బయటకు వచ్చిన తర్వాత అక్కడేవున్న 108 సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స చేశారు.

ఇక ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ యువకులను కూడా చికిత్స నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు తెతిపారు. యువకుల ప్రాణాలు కాపాడిన సీఐ సుజన్ ను పోలీస్ ఉన్నతాధికారులు, సామాన్యులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

వీడియో

"