తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం సమయంలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు.... ఏపీ సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలతో వెల్‌లోకి దూసుకురావడం.. సభ వాయిదా పడటంతో ప్రతి రోజు యుద్ధ వాతావరణం చోటు చేసుకునేది.

అప్పటికి మూడు సార్లు నాటి స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేశారు. పరిస్థితి చూస్తే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు అదే చివరి సమావేశం.. ఆ రోజు కనుక సభలో బిల్లు ఆమోదం పొందకపోతే.. తెలంగాణ ఏర్పాటు మరికొన్నేళ్లు వాయిదా పడేది.

దీంతో అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు .. నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలిసి బిల్లు ఆమోదం గురించి చర్చించారు. సీనియర్ పార్లమెంటేరియన్‌గా సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో ఆయన రూల్స్ బుక్‌ను పరిశీలించారు.

వెల్‌లో సభ్యులు ఉన్నా.. సభ్యుల తలలు లెక్కించి బిల్లును ఆమోదింపజేయవచ్చన్న నిబంధను జైపాల్ రెడ్డి వెతికి పట్టుకుని స్పీకర్‌కు తెలియజేశారు. ఈ విధానంతోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును నాటి లోక్‌సభ ఆమోదించిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకున్నారు.