కేవలం రెండు గుంటల భూమి కోసం ఓ దుండగుడు  దారుణానికి పాల్పడ్డాడు. భూవివాదం కారణంగా ఓ వ్యక్తిపై కోపాన్ని పెంచుకుని అతడిని పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రెండు భూమి విషయంలో స్థానికులు కిషన్, లక్ష్మణ్ ల మద్య వివాదం కొనసాగుతోంది. దీంతో తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో లక్ష్మణ్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యర్థి కిషన్ ను హతమార్చి ఆ భూమిని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేశాడు. 

లక్ష్మణ్ తన ప్లాన్ లో భాగంగా కిషన్ ను వివాదాస్పద స్థలం వద్దకు రప్పించాడు. ఇద్దరు అక్కడికి చేరుకున్న తర్వాత లక్ష్మణ్ తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో కిషన్ పై దాడికి పాల్పడ్డాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అతడు ఎదురుతిరిగినా దాడి నుండి తప్పించుకోలేక పోయాడు. ఈ దాడిలో కిషన్ తలతో పాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అతడు ప్రాణాపాయ స్థితిలో రక్తపు మడుగులో పడిపోయాక లక్ష్మణ్ లక్ష్మణ్ గొడ్డలిని అక్కడే వున్న మురికి కాలువలో పడేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. 

ఈ హత్యాయత్నం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడివున్న కిషన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగిన ప్రాంతంలో వున్న సిసి కెమెరాల్లో ఈ దాడి మొత్తం రికార్డవగా ఆ పుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.