ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీపై మాట్లాడినందుకు బాల్క సుమన్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీపై మాట్లాడినందుకు బాల్క సుమన్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను అప్పుడు.. ఇప్పుడు సమైక్యవాదినేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రతిక ప్రకటన విడుదల చేశారు. అప్పుడు సమైక్యవాదిగా ఉన్న తలసాని మీ కేబినెట్‌లో లేరా అని ప్రశ్నించారు. అప్పుడు ఉరికించి కొడతానన్న దానం నాగేందర్, ఎర్రబెల్లి దయాకర్ మీ పార్టీలో లేరా అని ప్రశ్నించారు. సమైక్య వాదులైన మంత్రి పువ్వడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా అంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్ లే కదా పని చేస్తోందని మండిపడ్డారు. ఇది మీకు సిగ్గు అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. మరొక్కసారి మాట్లాడితే మీ మొత్తం చరిత్ర చెప్తానని ఆయన హెచ్చరించారు. తమ నేత రాహుల్ గాంధీని ఓయూ కి రావొద్దని మాట్లాడుతున్నారని.. అసలు రాహుల్ గాంధీ రావొద్దని అనడానికి నువ్వు ఎవడివి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీపై మాట్లాడినందుకు బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బాల్క సుమన్ ఈ రోజే క్షమాపణ చెప్పాలని.. లేకపోతే యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఓయూ కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి ముట్టడిస్తారని చెప్పారు. మే 4 వ తేదీన నేను మినిస్టర్ క్వాటర్స్ కి వస్తున్నానని చెప్పారు. కేసీఆర్‌ని ముఖ్యమంత్రి హోదలో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోలేని మీరా మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, నేడు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని తెలంగాణ జనాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. సొంత రాష్ట్రంలో రాహుల్ తన పార్టీని గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఓయూకు వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు జగ్గారెడ్డి కొమ్ము కాశారని మండిపడ్డారు. ఉద్యమపార్టీకి ద్రోహం చేసిన చరిత్ర జగ్గారెడ్డిది అని అన్నారు. జగ్గారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు.
