తన రాజీనామాకు సంబంధించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ముంబై పర్యటనపై కూడా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్టుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాశారు. తాను రాజీనామా ఎందుకు చేయాలనుకుంటాననే అంశాలను అందులో ప్రస్తావించారు. పార్టీలో తనకు ఎదురవుతున్న పరిణామాలను కూడా అందులో పేర్కొన్నారు. ఇక, తన రాజీనామాకు సంబంధించి జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ముంబై పర్యటనపై కూడా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తే వారిని తన ఆవేదన చెప్తానని జగ్గారెడ్డి తెలిపారు. సీనియర్ నేతలు మాణిక్కం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ దగ్గర తన ఆవేదనకు పరిష్కారం దొరకదని చెప్పుకొచ్చారు. సీనియర్ నేతలు కొందరు తనతో మాట్లారని చెప్పారు.. 15 రోజులు ఎటువంటి కామెంట్స్ చేయనని వారికి మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు. సోనియా, రాహుల్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అన్నారు. అపాయింట్‌మెంట్ ఇప్పించకపోతే రాజీనామాపై తన స్టాండ్ మారదని 15 రోజుల తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.
గాంధీ భవన్‌లో ఒకరిద్దరు తన గురించి పోతే పోనీ అని కామెంట్స్ చేశారని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంపై తనకు ఎలాంటి కోపం లేదని వెల్లడించారు. ఆవేదన చెప్పుకోవాలనేదే తన ఆలోచన అని తెలిపారు. ప్రస్తుతం రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నానని తెలిపారు. 15 రోజుల తర్వాత నిర్ణయం చెబుతానని వెల్లడించారు. జగ్గారెడ్డి ఎందుకు రోడ్డెక్కాడనేదానికి ఠాగూరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 15 రోజులు వేచిచూద్దాం.. తన ఆవేదనకు మందు దొరికితే చూద్దాం అని కామెంట్ చేశారు.
కేసీఆర్ ముంబై టూర్‌పై..
తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలవడం ముఖ్యమైన అంశమేనని జగ్గారెడ్డి తెలిపారు. మహారాష్ట్ర సీఎం కాంగ్రెస్‌తోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. రైతు ఉద్యమకారుడు టికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషేనని చెప్పారని అన్నారు. బీజేపీతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం నుంచి బయటపడేందుకే కేసీఆర్ కొత్త ఎత్తుగడ అని విమర్శించారు. యూపీఏ కూటమి చీల్చాలని కేసీఆర్ అనుకున్నా అది అయ్యేపని కాదన్నారు.
బీజేపీతో నేరుగా కొట్లాడుతున్నది తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమేనని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. దమ్మున్నవారు ఎవరైనా పార్టీ పెడితే తెలంగాణలో స్పేస్ ఉందన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటే సింగిల్ ఫోన్ కాల్ చాలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
