Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ మాతో ఎలాంటి చర్చలు చేయడం లేదు.. అలా అంటే ఆయన ఫెయిల్ అయినట్లే కదా?: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో నిర్ణయాలు అన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో సమిష్టి నిర్ణయాలు జరగడం లేదని చెప్పారు. 

jagga reddy says revanth reddy takes all decisions
Author
First Published Nov 28, 2022, 3:36 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో నిర్ణయాలు అన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో సమిష్టి నిర్ణయాలు జరగడం లేదని చెప్పారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలలో అసమ్మతి ఉంటుందని చెప్పుకొచ్చారు. కొందరు అసమ్మతిని కోవర్టులు అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి తమతో ఎలాంటి చర్చలు చేయడం లేదన్నారు. మీటింగ్‌ల్లో తాము అడిగినవాటికి కూడా జవాబు దొరకడం లేదని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ, ఇంకెవరైనా గానీ చెబితే మాట్లాడటానికి తాను ఏమైనా చంటి పిల్లాడినా అని ప్రశ్నించారు. 

కొందరు సహకరిస్తలేరు అంటే రేవంత్ ఫెయిల్ అయినట్లే కదా? అని ప్రశ్నించారు. తనను అధిష్టానం ఏదైనా అడగాలని అనుకుంటే.. ముందుగా రేవంత్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి అడగాలని చెప్పారు. తాను మొదటి నుంచి పీసీసీ కావాలని అడుగుతున్నానని అన్నారు. తనకు పీసీసీ పదవి వచ్చే వరకు అడుగుతూనే ఉంటానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ఉన్నపుడు ఆయన్ను దించేయాలని రేవంత్ రెడ్డి అభిమానులు లేఖలు రాయలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీర్ కాదని అన్నారు. కాంగ్రెస్ అంటే జగ్గారెడ్డిదో.. రేవంత్ రెడ్డిదో కాదని  అన్నారు. 

రేవంత్ రెడ్డిని ఇప్పుడే దించెయ్యాలని తాను అనలేదని.. ఎన్నికల వరకూ కొనసాగించాలనే కోరుతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే తాను సహకరిస్తానని చెప్పారు. పీసీసీ పోస్టులో ఎవరున్నా లాభనష్టాల  క్రెడిట్ వారిదేనని అన్నారు. రేవంత్ రెడ్డి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం లేదని.. ఇదే తాను పార్టీ శ్రేణులకు చెబుతున్నానని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios