సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  


తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజులు జగ్గారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలోపల ఉండి కొట్లాడాలని సూచించారు. పార్టీని వీడొద్దని కోరారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు జగ్గారెడ్డి పార్టీని వీడకుండా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జగ్గారెడ్డిని ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మాట్లాడారు. జగ్గారెడ్డి ఇంటికి చేరుకున్న పీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్.. కాంగ్రెస్‌ను వీడొద్దని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని కిషన్ బతిమిలాడారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు వెళ్దామని జగ్గారెడ్డికి చెప్పారు. పార్టీ నుంచి సీనియర్ నేతలను బయటకు పంపే కుట్ర జరుగుతుందని వీహెచ్ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పద్దతి బాగోలేదని మండిపడ్డారు. ఒరిజనల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుందని.. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసేందకు ఎంతవరకైనా సిద్దమని చెప్పారు. 

కోవర్డు అనే ప్రచారం ఇబ్బందిగా మారిందన్నారు. తన భార్యకు దీనిపై ఫోన్‌లు రావడం బాధించిందని చెప్పారు. తాను పార్టీ కోసం పనిచేసిన అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తుంటే కోవర్డు అనే ప్రచారం జరుగుతుంటే టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పట్టించుకోలేదని అన్నారు. తన వల్లే పార్టీకి ఇబ్బందులు కలుగుతున్నాయనే ఫీలింగ్ కల్పిస్తున్నారని చెప్పారు. తాను త్వరలోనే రాజీనామా చేయనున్నట్టుగా వెల్లడించారు.

అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలోకి వెళ్లనని జగ్గారెడ్డి తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ కోవర్టునా..? అంటూ ప్రశ్నించారు. తనకు పార్టీలో అవమానం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌లోకి పోవాలంటే రెండేళ్ల క్రితమే పోయేవాడినని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న.. అవమానాలు పాలు కావాలా అని ప్రశ్నించారు. పీసీసీ పద్దతి బాగోలేదని విమర్శించారు. తనను కోవర్డు అని ప్రచారం లేదని మాణిక్కం ఠాగూర్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. 

కాసేపట్లోనే సోనియాకు జగ్గారెడ్డి లేఖ.. 
కాసేపట్లోనే సోనియా గాంధీకి లేఖ రాయనున్నాట్టుగా తెలుస్తోంది. పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులపై, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా పార్టీలో కొందరు కుట్రలు చేశారని, తాను పార్టీ కోసం విశేషమైన కృషి చేసినప్పటికీ అవమానించారని, అది తట్టుకోలేకనే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన సోనియాకు లేఖలో వివరించనున్నట్లు సమాచారం.