ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఫోటీ చేసిన ఈయన తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను ఓడించి మరోసారి ఎమ్మెల్యేగా నిలిచారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి హరీష్ రావే స్వయంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.   

అయితే ఈ ప్రచారంపై జగ్గారెడ్డి స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగినా కాంగ్రెస్ ను వీడనని ప్రకటించారు. కానీ గతంలో మాదిరిగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటానని జగ్గారెడ్డి వెల్లడించారు. 

అయితే తనను గెలిపించిన ప్రజలు, నియోజకవర్గ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్‌ను త్వరలో కలుస్తానని ప్రకటించారు. అందుకు ప్రభుత్వం సహకరించకపోతే ప్రజల్లోకి వెళ్లి వివరిస్తానన్నారు. అయితే ప్రభుత్వ సహకారం తనకుంటుందని ఆశిస్తున్నానని జగ్గా రెడ్డి తెలిపారు. తన విజయానికి కృషి చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఓ సభ నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.