సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు, మాజీ మంత్రి హరీశ్ రావుపై సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడదు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్ట్‌లు కట్టలేదనే హరీశ్ రావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ హయంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, సింగూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల వంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని చెప్పారు. 

ఐదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్ రావు ఎన్ని ప్రాజెక్ట్‌లు కట్టారో తెలపాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఏ ప్రాజెక్టు ఎవరు కట్టారో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద చర్చ పెడదామని, హరీశ్ రావుకు దమ్ముంటే చర్చకు రావాలని ఆయన అన్నారు. హరీశ్ రావులా తాను గోతులు తీసే రకం కాదని జగ్గారెడ్డి విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెసు పార్టీయేనని జగ్గారెడ్డి అన్నారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీ వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. హైదరాబాదుకు నీళ్లు తెచ్చింది కూడా కాంగ్రెసు పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసును రూపుమాపాలనే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.