Asianet News TeluguAsianet News Telugu

జగన్ అక్రమాస్తుల కేసు : బ్రహ్మానందరెడ్డిపై విచారణ తప్పదు, కేసునుంచి తప్పించలేం : తెలంగాణ హైకోర్టు

జగన్ అక్రమాస్తుల కేసునుంచి కె.వి. బ్రహ్మానందరెడ్డిని విచారణ నుంచి తప్పించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన డిశ్చార్జి పిటిషన్ ను కొట్టివేసింది. 

Jagan illegal assets case : Brahmananda Reddy must be investigated..Telangana High Court
Author
Hyderabad, First Published Jul 28, 2022, 8:28 AM IST

హైదరాబాద్ : వైఎస్ జగన్ అక్రమాస్తులు వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్ పిక్ ప్రాజెక్టు కేసులో ఆరో నిందితుడైన మాజీ ఐఆర్ఏఎస్ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన మీద విచారణను నిలిపివేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసునుంచి తప్పించలేమని కోర్టు పేర్కొంది. రికార్డుల్లో ఉన్న ఆధారాలతో శిక్ష పడుతుందా? లేదా? అన్నది విచారణ చివరలో తేలుతుందని స్పష్టం చేసింది.  విచారణకు తగినంత సమాచారం ఉందని ఈ కోర్టు అభిప్రాయ పడుతోందని తెలిపింది. అందువల్ల సీబీఐ కోర్టు 2016 ఆగస్టులో వెలువరించిన తీర్పును తప్పుపట్టలేమంటూ బ్రహ్మానందరెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తూ 53 పేజీల తీర్పును హై కోర్టు వెలువరించింది. 

తన మీద కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బ్రహ్మానందరెడ్డి తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిమీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. ఇరుపక్షాల వాదనలతో పాటు సమర్పించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ తెలంగాణ హైకోర్టు సీజే తీర్పు వెలువరించారు. కింది కోర్టు విచారణలో భాగంగా అభియోగాల నమోదు సమయంలో నిందితుడితో పాటు ప్రాసిక్యూషన్ వాదనలు వింటారని, నిందితుడిపై అనుమానాల తీవ్రత ఎక్కువగా ఉంటే విచారణ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతూనే దీనిపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు.

కేసీఆర్ కే ఓటు వేస్తాం, తెలంగాణను గెలిపిస్తాం.. అనేటోళ్లకే దళితబంధు.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

నిందితుడిని కేసు నుంచి డిశ్చార్జి చేయడం.. హైకోర్టు జోక్యం తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలోని అంశాలు సీబీఐ కోర్టు తీర్పులోని అంశాలను పేర్కొంటూ బ్రహ్మానందరెడ్డిపై విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపారు. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్న నేపథ్యంలో సిబిఐ కోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసిందని, ఆ తీర్పును తాము తప్పు పట్టలేం అని పేర్కొంది.

నేపథ్యం ఇది…
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉపాధి కల్పన నిమిత్తం చేపట్టిన వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఆధారిత పారిశ్రామికవాడ  (వాన్ పిక్)పేరుతో చేపట్టిన ప్రాజెక్టు అమలుకు ఏపీ ప్రభుత్వం, రస్ అల్ ఖైమా (రాక్) ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారతీయ భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన మాట్రిక్స్ ఎన్ పోర్టు హోల్డింగ్స్ రంగంలోకి దిగింది. ప్రాజెక్టు నిమిత్తం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 12,973 ఎకరాలను కేటాయించింది. వాన్పిక్ ఫోర్ట్స్ ప్రాజెక్టు పేరుతో సొంత వాట అధికంగా ఉన్న వాన్పిక్ ప్రాజెక్టు లిమిటెడ్ కు భూ కేటాయింపులు, రాయితీలు కల్పించారని సీబీఐ ఆరోపించింది.

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు చేయడంతోపాటు ప్రాజెక్టులో రాక్ వాటా తగ్గింపు సహా అన్నీ జరిగాయని ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు, కొనుగోళ్లు జరిగాయని రాక్ నుంచి ప్రాజెక్టు నిమిత్తం వచ్చిన నిధులను మళ్లించారని ఆరోపించారు. వాన్ పిక్ ప్రాజెక్టుతో ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 854 కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios