రాయల తెలంగాణ అంశం తెరపైకి రావడంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. రాయల తెలంగాణ కోరడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడానికి నిదర్శనమని, పాలకులను మార్చాలని పిలుపునిచ్చారు.

మరోసారి రాయల తెలంగాణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాయలసీమను తెలంగాణలో విలీనం చేయాలని, విలీనం చేస్తే ఎలాంటి నీటి సమస్య ఉండదన్నారు. తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రాలను విడగొట్టడం సులభమే కానీ.. కలపడమే కష్టమేమని అన్నారు. 

అయితే.. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమవతుందని, రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. ఆంధప్రదేశ్ లో ప్రభుత్వం వైఫల్యం కావడం వల్ల రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందని, ప్రత్యేక రాయలసీమ గానీ, రాయల తెలంగాణ గానీ.. ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణలో కలపాలని పక్క రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ అభివృద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. 

తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టే.. ఏపీలో సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని కేసీఆర్ గతంలోనే చెప్పారనీ, కానీ.. పరిపాలకుల్లో చిత్తుశుద్ధి లోపించడం వల్లే ఇలాంటి డిమాండ్లు తెరపైకి వస్తున్నాయనీ అన్నారు. పాలకులను మార్చండి.. సువర్ణాంధ్రను సాధించుకోండని పిలుపు నిచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారనీ, వెనుకబాటుకు కారణమైన పరిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలని సూచించారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.