Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఒక బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె గవర్నర్‌లా ఉండకుండా.. బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagadish Reddy: తెలంగాణ గవర్నర్ తమిళసై పై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్రగవర్నర్ తమిళిసై.. ఒక బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తమిళిసై గవర్నర్‌లా ఉండకుండా.. బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర రాజకీయ కార్యకలాపాలకు రాజ్‌భవన్ కేంద్రంగా మారుతుందని, అయినా సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుతో గవర్నర్‌కు ఏం సంబంధమని మంత్రి నిలదీశారు.
గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని మరిచినట్టున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసే వ్యాఖ్యలు గవర్నర్ నోటివెంట రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ ఒక్క మాట చాలు గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తుందని చెప్పడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం పోటీలు పడి మరీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ ఏమన్నారంటే..?
ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని, తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోరని అన్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెరాస ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వంజమెత్తారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. కానీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతో దేశ పౌరుల తలసరి ఆదాయం తగ్గిందని ఆరోపించారు.
తెలంగాణాలో బాధ్యతా రాహిత్య ప్రతిపక్షాలు ఉన్నాయని, వార్తల్లో ట్రెండింగ్ కావడం కోసం ప్రతిపక్ష నాయకులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ఏమీ లేక సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అప్పుల మీద పార్లమెంటులో మాట్లాడకుండా.. రాష్ట్ర అప్పులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
