తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం దేశానికే ఆదర్శమని ఐటీ, పురపాలక శాక మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వీటిని డబుల్ బెడ్ రూం ఇళ్లు అనే కంటే ఆత్మగౌరవ నివాసాలుగా పిలుచుకోవచ్చన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా దివిటి పల్లిలో ఒకే చోట భారీ సంఖ్యలో(1,024) నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మంత్రి ఇవి తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అద్భుత కట్టడాలని ప్రశంసించారు.

 పేదలు ఆత్మగౌరవంగా జీవించడం కోసం దాదాపు రూ. 17,000 కోట్ల ఖర్చుతో ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇలా పేదల కోసం  ప్రతిష్టాత్మక పథకాన్ని చేపడుతున్న తెలంగాణ రాష్ట్రం వంటి రాష్ట్రం దేశంలో మరోటి లేదని అన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేదల నివాసాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మంత్రి ల‌క్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇళ్లను పొందిన లబ్ధిదారులతో మాట్లాడి వారి స్పందనను తెలుసుకున్నారు.