హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్ సంస్థపై చర్యలకు రంగంలోకి దిగింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోన్న డేటా చోరీ వివాదం కేసులో కీలకమైన ఐటీ గ్రిడ్ సంస్థను సిట్ బృందం సీజ్ చేసింది. 

మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. డేటా చోరీ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోందని విచారణలో భాగంగా కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే డేటా చోరీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. 

రంగంలోకి దిగిన ఈ బృందం కేసు విచారణ చేపట్టింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర సారధ్యం వహించనున్నారు. కేసు విచారణలో భాగంగా పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు ఐజీ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. 

తెలంగాణ డేటా కూడా ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ డేటాను ఏమైనా చేశారా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆశోక్ అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకుంటామని విచారించి తీరుతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

ఆశోక్‌ను చట్టపరంగానే తీసుకొస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవా మిత్రలోని కొన్ని ఫీచర్లు పనిచేయకుండా చేశారని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పిన విషయం తెలిసిందే.