హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుండి జరిగే పలు  కామన్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని దాఖలైన పిల్ పై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణను చేపట్టింది.కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్  పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని పిల్ దాఖలైంది.

ఈ పిల్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. హైద్రాబాద్ లో లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. లాక్ డౌన్ పెడితే ప్రవేశ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని కూడ ఏజీని హైకోర్టు ప్రశ్నించింది.

హైద్రాబాద్ లో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని కూడ ఏజీని హైకోర్టు అడిగింది. రెండు మూడు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రవేశపరీక్షల నిర్వహణ విషయాన్ని కూడ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని ఏజీ హైకోర్టుకు నివేదించారు.

దీంతో ఈ కేసు విచారణను ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకు హైకోర్టు వాయిదా వేసింది. జూలై 1వ తేదీన పాలీసెట్ పరీక్ష ఉంది. ఈ నెలలోనే ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.