హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చివరి నిమిషంలో చేసిన ప్రకటన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి సాయపడిందా అనే చర్చ సాగుతోంది. తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా పవన్ కల్యాణ్ వాణిదేవికి మద్దతు ప్రకటించారు. 

హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పీవీ నరసింహా రావు కూతురు వాణిదేవిని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలోకి దించారు. బ్రాహ్మణ ఓటర్లను చీల్చడానికి అది పనికి వచ్చిందని చెప్పవచ్చు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో ఆమెకు తండ్రి పీవీ నరసింహారావు పేరు కూడా పనికి వచ్చింది. పైగా, ఆమె మహబూబ్ నగర్ జిల్లా కోడలు. ఈ విషయాన్ని వాణిదేవి ఓటర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు. 

ఆ విషయాలను అలా పక్కన పెడితే,  పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బేఖాతరు చేస్తూ వాణిదేవికి చివరి నిమిషంలో మద్దతు ప్రకటించారు. బిజెపితో పొత్తు ధర్మాన్ని విస్మరించి ఆమెకు మద్దతు ప్రకటించారు. బిజెపి అభ్యర్థి రామచందర్ రావు బరిలో ఉన్నప్పటికీ ఆయన ఆ పనిచేశారు. అదే సమయంలో బిజెపిపై జనసేన నాయకుడు పోతిన మహేష్ బిజెపిపై విరుచుకుపడ్డారు. బిజెపి వల్లనే తాము విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన విమర్శించారు. 

అవన్నీ వాణిదేవికి కలిసి వచ్చాయనే చెప్పాలి. వాణిదేవి రామచందర్ రావుపై ఘన విజయమేమీ సాధించలేదు. చాలా తక్కువ మెజారిటీతోనే విజయం సాధించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పవన్ కల్యాణ్ మద్దతు ఆమెకు ఉపయోగపడే ఉంటుందని భావించవచ్చు. మొత్తం మీద, పవన్ కల్యాణ్ అభిమానులు జబ్బలు చరుచుకునే ఫలితం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో వచ్చింది.