నేటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర: కలిసొచ్చేనా?
కాంగ్రెస్ పార్టీ ఇవాళ్టి నుండి తెలంగాణలో బస్సు యాత్ర ప్రారంభించనుంది.ఈ బస్సు యాత్రలో రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. తొలి విడత మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది.
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను నిర్వహించనుంది. బుధవారంనాడు ములుగు నియోజకవర్గంలో బస్సు యాత్రను రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు బస్సు యాత్ర సాగుతుంది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బస్సు యాత్ర నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బస్సు యాత్రను చేపట్టాలని భావించారు. అయితే అనేక కారణాలతో బస్సు యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. తొలుత ఈ నెల 15న బస్సు యాత్రను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభించాలని భావించారు. కానీ ఆ తర్వాత యాత్రను ఈ నెల 18వ తేదీకి మార్చారు. ఇవాళ సాయంత్రం ములుగులో ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బస్సు యాత్ర ఆ పార్టీకి మంచి ఊపు తీసుకు వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి నుండి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టింది. ఆనాడు సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సహా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలంతా బస్సు యాత్రలో పాల్గొన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బస్సు యాత్రలో ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీగా ఉన్న గులాం నబీ ఆజాద్ కూడ బస్సు యాత్రలో పాల్గొన్నారు.
బస్సు యాత్ర సమయంలో ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలను పార్టీ నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకొనే వారు. తాము ప్రయాణం చేసే మార్గంలోని గ్రామాల కూడళ్ల వద్ద ప్రసంగించి తిరిగి మరో గ్రామానికి నేతలు బస్సులో వెళ్లేవారు. కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలంతా తమ మధ్య విబేధాలను పక్కన పెట్టి ఒకే బస్సులో ప్రయాణించారు. బస్సు యాత్ర ఆనాడు కాంగ్రెస్ కు మంచి ఫలితాలను తెచ్చిందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడ బస్సు యాత్రను కాంగ్రెస్ చేపట్టింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది.ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది.బస్సు యాత్ర నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలోనే నిర్ణయించారు. కానీ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ సాయంత్రం ములుగులో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.బస్సు యాత్ర ద్వారా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కాంగ్రెస్ నేతలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయనున్నారు.అయితే ఈ బస్సు యాత్రతో కాంగ్రెస్ కు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.