తెలంగాణపై బీజేపీ పక్కా స్కెచ్.. రంగంలోకి అమిత్ షా.. పాలమూరు నుంచి బరిలోకి..!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో మరోసారి అధికారం కైవసం చేసుకోవడంతో పాటు.. తెలంగాణను కూడా తమ అడ్డగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో మరోసారి అధికారం కైవసం చేసుకోవడంతో పాటు.. తెలంగాణను కూడా తమ అడ్డగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణను వేగవంతం చేయాలని చూస్తోంది. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. గత ఎన్నికలకు మించిన మెజారిటీతో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంది.
ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ చివరలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారానికి సంబంధించిన 2.0ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీజేపీ ఎక్కువగా దక్షిణాదిపై ఫోకస్ చేసింది.
ఇందులో భాగంగానే పార్టీ అగ్రనాయకులు కొందరిని దక్షిణాది నుంచి బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సార్వత్రిక ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక పరిశీలనల అనంతరం.. పాలమూరు (మహూబ్‌నగర్) నుంచి అమిత్ షాను బరిలో నిలపాలని నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు బీజేపీ కోర్ గ్రూప్ సంకేతాలు ఇస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆరెస్సెస్, సంఘ్‌పరివార్ నేతలతో బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీల ముఖ్యుల భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ నుంచి అమిత్‌షా లోక్‌సభకు పోటీ చేయడం వల్ల రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడటంతో పాటు.. రాష్ట్రంలో పార్టీ గురించి మరింత చర్చ పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే పాలమూరు నుంచి బరిలో దిగితే అమిత్ షా పలుమార్లు రాష్ట్రానికి వస్తారని.. ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 2019లో రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి 10కి పైగా స్థానాలను గెలుచుకునేలా వ్యుహాలను సిద్దం చేసుకుంటుంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతుండగా.. ఈ నెల 28న అమిత్ షా మరోమారు తెలంగాణకు వస్తున్నారు. అమిత్ షా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షిస్తారు. అలాగే.. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో క్లస్టర్ సమావేశాలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో అమిత్ షా రెండు క్లస్టర్ సమావేశాలలో పాల్గొంటారని, ఎన్నికల సన్నాహాలను సంస్థాగతంగా పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఇక, రాష్ట్రంలో పార్టీ ఎన్నికల సన్నాహాలు పూర్తిగా బీజేపీ అధినాయకత్వం పర్యవేక్షణలోనే సాగుతున్నాయి.
పాలమూరు నుంచి మోదీ పోటీ చేయాలి..
పాలమూరు నుంచి బీజేపీ జాతీయ నేతలు పోటీ చేయాలనే రాష్ట్ర నాయకులు కూడా కోరుతున్నారు. పాలమూరు నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేస్తే రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.