కుత్బుల్లాపూర్: గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ బాబాయ్, అబ్బాయిలు మూడోసారి పోటీ పడుతున్నారు. ప్రజా కూటమి తరపున కూన శ్రీశైలం గౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థిగా కూన వివేకానంద గౌడ్  బరిలోకి దిగుతున్నారు. 

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో కూన శ్రీశైలం గౌడ్ ఆ సమయంలో ఇండిపెండెంట్ గా  బరిలోకి దిగారు.  కూన శ్రీశైలం గౌడ్  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  అనుచరుడిగా పేరుంది. 

కూన శ్రీశైలం గౌడ్  కుత్బుల్లాపూర్ నుండి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఏపీ పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా కూడ పనిచేశారు. 2009 ఎన్నికల సమయంలో  టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య  పొత్తు ఉంది. ఈ పొత్తులో భాగంగా  ఈ స్థానం నుండి టీఆర్ఎస్  అభ్యర్థిగా కేపీ వివేకానంద పోటీ చేశారు. కూన శ్రీశైలం గౌడ్,  కేపీ వివేకానందలు మరుసకు బాబాయ్, అబ్బాయిలు.

2009 ఎన్నికల్లో వివేకానంద ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత  వివేకానంద  టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వివేకానందకు టీడీపీ అభ్యర్థిగా వివేకానంద పోటీ చేశారు. కుత్బుల్లాపూర్ నుండి  వివేకానంద విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కూన శ్రీశైలం గౌడ్  వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు   శ్రీశైలం గౌడ్  తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

రెండో సారి బాబాయ్, అబ్బాయిలు మరోసారి 2014 ఎన్నికల సమయంలో పోటీ పడ్డారు. అబ్బాయి చేతిలో బాబాయ్ కూన శ్రీశైలం గౌడ్  2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మరోసారి బాబాయ్, అబ్బాయిలు పోటీ చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన వివేకానంద గౌడ్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ దఫా ఆయన  టీఆర్ఎస్ అభ్యర్థిగా  బరిలోకి దిగారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం.   ఈ ప్రాంతంలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే  మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. వివేకానంద విజయం కోసం టీఆర్ఎస్ ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. 

కూన శ్రీశైలం గౌడ్  విజయం కోసం  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణలు  విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ హయంలో జరిగిన అభివృద్ధి గురించి కూన శ్రీశైలం గౌడ్, కేపీ వివేకానందలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

వివేకానంద విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నారు.విద్యావంతుడు, కేటీఆర్, కేసీఆర్ మద్దతు వివేకానందకు పుష్కలంగా ఉన్నాయని  ఆయన అనుచరులు  చెబుతున్నారు. కాలనీలు, బస్తీల నేతలతో చనువుగా వ్యవహరిస్తారు. టీడీపీ నుండి  టీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీలో అందర్నీ కలుపుకొనిపోయే పరిస్థితి లేదనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.

కూన శ్రీశైలం గౌడ్ కు కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టుంది. గతంలో హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ప్రాంతంలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.  టీడీపీ కూడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది.