హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేసినా తక్కువేనని సినిమాలోని డైలాగులు ఆ యువకుడి తలపట్టేశాయి. ప్రేమించడం అంటే అమ్మాయి ఏం అడిగిన తెచ్చి ఇవ్వడమేననుకున్నాడో ఏమో గానీ సొంతింటికి కన్నం వేస్తూ ప్రేమికురాలికి పూర్తిగా దాసోహం అయిపోయాడు. 

నీకు కావాలని అడుగు ఆకాశంలో చుక్కలను సైతం తీసుకువస్తానని ప్రేమికుడు ప్రియురాలుతో అన్న మాటలను చాలా సినిమాల్లో చూశాం. అది పాతడైలాగ్ రొటీన్ గా కాకుండా కొత్తగా ఏదో చెయ్యాలని ట్రై చేశాడో ఏమో గానీ ప్రేమించిన యువతి కోసం అమ్మ నగలే చోరీ చేశాడు. 

ప్రేమికురాలి కోసం కన్న తల్లి నగలు, డబ్బు కాజేసిన వైనం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండలోని ఎస్ఆర్ఆర్ పురం కాలనీకి చెందిన అరుణ్ అనే యువకుడు ఓ అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.  

ప్రేమించిన అమ్మాయి కోసం అరుణ్ తన ఇంట్లో తల్లి దాచిపెట్టిన బంగారం, నగలు కాజేస్తూ వస్తున్నాడు. అరుణ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి గమనించింది. అయితే ఇంట్లో దాచిపెట్టిన 8 తులాల బంగారం, 50 వేల నగదు కనిపించకపోవడంతో అవాక్కైంది.  

తన కొడుకు అరుణ్ చోరీ చేశాడని గుర్తించిన తల్లి లక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో అరుణ్ పై ఐపీసీ 420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు.