హైదరాబాద్: కాలేజీ యాజమాన్యం వేధింపులతో పాటు  కాలేజీ లెక్చరర్ తనపై దాడికి పాల్పడడంతో మనోవేదనకు గురైన  స్నేహ సూర్య అనే ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు కాలు విరిగి ప్రాణాలతో అతను బయటపడ్డాడు.బాదితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సోమవారం నాడు కాలేజీ ఎదుట విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. 

హైద్రాబాద్ చైతన్యపురిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదివే విద్యార్ధి సూర్య తీవ్ర మనోవేదనకు గురై  నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సూర్యాపేటకు చెందిన స్నేహసూర్య టెలిపోన్ కాలనీలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ సిబ్బంది వేధింపులతో పాటు భౌతిక దాడికి పాల్పడడంతో మనోవేదనకు గురైన సూర్య ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

అయితే ఇంటిపై నుండి కిందకు దూకడంతో స్నేహ సూర్య కాలు విరిగింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన విద్యార్ధి సంఘాలు  సోమవారం నాడు  కాలేజీ ఎదుట ధర్నాకు దిగాయి. 

కాలేజీ లోపలికి వెళ్లేందుకు విద్యార్ధి సంఘాలు ప్రయత్నాలు చేశాయి. అయితే పోలీసులు వారిని నిలువరించారు. విద్యార్ధికి న్యాయం చేయాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్ధిని ఇబ్బందులకు గురిచేసిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.