మేడ్చల్‌: కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడపాలని ఆశపడింది. కుమార్తెకు సెలవులు ఇచ్చారని తెలిసి తండ్రి కుమార్తెను తీసుకునేందుకు వెళ్లాడు. కుమార్తెను కారులో ఎక్కించుకుని ఇంటికి తిరిగిపయనమయ్యారు. 

మరికొద్ది సేపట్లో ఇంటికి వెళ్తారనుకునే లోపు మార్గ మధ్యలో మృత్యువు కబలించింది. తండ్రి కూతురిని విడదీసింది. హాస్టల్ ఉన్న కుమార్తెను ఇంటికి తీసుకెళ్తుంటే ఆభగవంతుడు తిరిగిరాని లోకాలకు తన కూతురుని తీసుకెళ్లిపోయాడంటూ ఆ తండ్రి రోదిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టించింది. 

వివరాల్లోకి వెళ్తే అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌కు చెందిన  మురళీగౌడ్‌ కుమార్తె మేఘన(17) బాచుపల్లి శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గురువారం నుంచి కాలేజీకి సెలవులు ప్రకటించడంతో మురళీ గౌడ్‌ గురువారం మధ్యాహ్నం కుమార్తెను తీసుకుని కారులో నిర్మల్‌ బయలుదేరాడు. 

అయతే  అత్వెల్లి శివారులోని రేకుల బావి మలుపు వద్ద కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న రేలింగ్‌ ను ఢీ కొట్టింది. కారు వేగంగా ఉండటంతో  రేలింగ్‌ రేకులు వెనుక సీట్లో కూర్చున మేఘన తలలోకి చొచ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

మురళీగౌడ్, డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేఘన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.