10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు.

వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. గతంలోనే వీరిపై పలు కేసులు నమోదయ్యాయని.. తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వీరంతా జగద్గిరిగుట్ట అంబేద్కర్ కాలనీలో షెల్టర్ తీసుకున్నారని సజ్జనార్ చెప్పారు.

ముందుగా చోరీకి పాల్పడే ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారని, నేరాలు చేసే సమయంలో ఆయుధాలు ఉపయోగిస్తారని సీపీ పేర్కొన్నారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారిని చంపేందుకైనా వెనుకాడరని సజ్జనార్ వెల్లడించారు. వీరిపై ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరి నేరాలపై ఇంకా విచారించాల్సి వుందని ఆయన తెలిపారు.