హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత కేటీఆర్ తొలిసారిగా వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.   

నియోజకవర్గ అభివృద్ధి కోసం రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి కండీషన్లు లేకుండా పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ప్రకటించారు. గిరిజనుల అభివృద్ధికోసం రాములు నాయక్ పనిచేస్తున్నారని అందుకు తాము కూడా సహకరిస్తామన్నారు. 

పార్టీలో చేరికలు ప్రారంభమవ్వడం సంతోషకరమన్న కేటీఆర్ రాములు నాయక్ ను అభినందించారు. రాములు నాయక్ 62 ఏళ్ల యంగ్ డైనమిక్ లీడర్ అంటూ కొనియాడారు. ఇకపై తాను వైరా నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని తెలిపారు. 

మరోవైపు గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా  రాములు నాయక్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని తెలిపారు. 

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు.  అటు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సైతం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.