ఎన్నికల హోరు మొదలైంది అంటే చాలు అందరూ ప్రధాన పార్టీ అభ్యర్థుల వైపే చూస్తారు. చాలా మంది అభ్యర్థిని కాకుండా పార్టీ గుర్తును చూసే ఓటు వేస్తారు. అలాంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ఎక్కువ శాతం ఎవరూ పోటీకి దిగరు. కానీ ఓ వ్యక్తి మాత్రం కీలకమైన నియోజకవర్గానికి ఒక సారి కాదు.. ఇప్పటికి ఏడు సార్లు నామినేషన్ దాఖలు చేశారు.

ఆయనే షాబాద్ రమేశ్. ఈయన ఖైరతాబాద్‌ ప్రాంతానికి  చెందిన వ్యక్తి. చిన్నపాటి కిరాణా స్టోర్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన ఎన్నికల కోసం ఏడుసార్లు నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. " నేను ఉపఎన్నికలతో కలిపి ఇప్పటి వరకూ ఏడుసార్లు నామినేషన్ దాఖలు చేశాను. ప్రజలకు సేవ చేయాలన్నది నా ఆశయం. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే మిగతా రాజకీయ నాయకులకంటే ఎక్కువగా సేవ చేస్తాను. నియోజకవర్గంలో ఉండే సమస్యలను పరిష్కరిస్తాను" అని చెప్పుకొచ్చారు. ఇటీవల మరోసారి నామినేషన్ వేసిన ఆయన తన మేనిఫెస్టోతో కూడిన కరపత్రాలతో జనాలకు వెళ్లి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాగా ఇప్పటి వరకూ రమేశ్‌కు ఓసారి 1000 ఓట్లు మరోసారి 1500 ఓట్లు 2014 ఎన్నికల్లో 108 ఓట్లు పోలయ్యాయి.
 
ఇదిలా ఉంటే.. ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రావణ్ దాసోజు బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే శ్రావణ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు.