రాష్ట్ర అడిష‌న‌ల్ డీజీపీ హోదాలో వుండటంతో పాటు వుమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మహిళా ఐపిఎస్ స్వాతి లక్రాకు అత్యన్నత రాష్ట్రప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కం దక్కింది. 

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఉత్తమ సేవల అందించిన సైనికులు, పోలీసులకు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1380 మంది పోలీసులకు పతకాలు దక్కగా వీరిలో 11మంది ఏపీ, 14మంది తెలంగాణకు చెందినవారు వున్నారు. విధి నిర్వహణలో ధైర్యసాహసాలను ప్రదర్శించడంతో పాటు అత్యున్నత సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది. 

తెలంగాణకు చెందిన మహిళా ఐపిఎస్ అధికారి స్వాతి లక్రా కు రాష్ట్రప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కం దక్కింది. ఈమె ప్రస్తుతం రాష్ట్ర అడిష‌న‌ల్ డీజీపీ హోదాలో వుండటంతో పాటు వుమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక జ‌న‌గామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు క‌మిష‌న‌ర్ బండ శ్రీనివాస్ రెడ్డి కూడా రాష్ట్రప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కానికి ఎంపికయ్యారు. 

read more independence day: నూతన భారత నిర్మాణానికి ‘సబ్ కా ప్రయాస్’ అత్యావశ్యకం: ప్రధాని మోడీ

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే చిత్తూరు సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి నలగట్ల సుధాకర్‌రెడ్డి, గ్రేహౌండ్స్‌ విభాగంలో కమాండెంట్ గా పనిచేస్తున్న సీతారాం సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ఏపీకి చెందిన మరో 14మంది పోలీసులకు ప్రతిభా పురస్కారాలు, 11మందికి శౌర్య పతకాలు దక్కాయి. 

ఈ పతకాలను దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ చేతులమీదుగా పోలీస్ అధికారులు అందుకోనున్నారు. తమకు ఈ పతకాలు దక్కడంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐపిఎస్ లు ఆనందం వ్యక్తం చేశారు.