Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటుంది.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించింది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Independence Day 2022 cm KCR hoisting national flag At golconda fort
Author
First Published Aug 15, 2022, 10:39 AM IST

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించింది. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీసుల నంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా..  ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితం 1.2 కోట్ల జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసింది. నేడు యావత్ తెలంగాణ త్రివ‌ర్ణ శోభితంతో మెరిసిపోతోంది. దేశ‌భ‌క్తిని చాటే అనేక కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటున్నాం.మ‌హానీయుల త్యాగాల వ‌ల్లే స్వాతంత్ర్య ఫ‌లాలు అనుభ‌విస్తున్నాం. 

తెలంగాణ వృద్దిరేటు దేశ వృద్దిరేటు కంటే 27 శాతం అధికం. 2013-14లో తలసరి ఆదాయం రూ. లక్షగా ఉండేంది. 2021-22 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం జాతీయ తలసరి ఆదాయంరూ. 1.5 లక్షలుగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం అధికంగా ఉంది. ఏడేళ్లలో తెలంగాణలో వ్యవసాయం పరిమాణం 2.5 రెట్లు పెరిగింది. పారిశ్రామిక రంగం రెండు రేట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి. తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చగా కనిపిస్తోంది. 

ప్రజాసంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ప్రతివర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేస్తున్నాం. దీంతో రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు 46 లక్షలకు చేరుతాయి. దేశం ఎస్సీ వర్గం పట్ల నేటికి వివక్ష కొనసాగుతుంది. ఎస్సీల అభివృద్దే ధ్యేయంగా దళిత బంధు పథకం తెచ్చాం. దళిత బంధు పథకం దేశానికి దిశానిద్దేశం చేస్తోంది. దళిత బంధు లబ్దిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమైంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లను ఆర్థిక సాయం అందజేస్తున్నాం. పథకం కింద ఇప్పటివరకు 11.24 లక్షల మందికి రూ. 9,716 కోట్లు ఖర్చు చేశాం. గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపకం చేస్తున్నాం. గొర్రెల పెంపకంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పింక్ విప్లవం సాధ్యమైంది. మత్య్సకారులకు చేప పిల్లల పంపకం ద్వారా  నీలి విప్లవం  సాధించాం. గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. దోబీ ఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వివిధ వృత్తుల ఆదాయం పెంచేందుకు ఇవన్నీ దోహదం చేస్తున్నాం. నేతన్నకు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాం. నేత కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నాం. విద్యుత్ కోతలు విధించని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వేసవిలోనూ అన్ని రంగాలకు విద్యుత్ అందించాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం’’ అని చెప్పారు.


ఇక, ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త వజ్రోత్సవాల సమయంలో.. భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios