హైదరాబాద్ మాదాపూర్ వడ్డెర బస్తీలో కలకలం రేపిన కలుషిత నీటి ఘటనకు సంబంధించి బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ మాదాపూర్ వడ్డెర బస్తీలో కలకలం రేపిన కలుషిత నీటి ఘటనకు సంబంధించి బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 76కి చేరింది. వీరిలో 34 మంది చిన్నారులు ఉన్నారు. కలుషిత నీటివల్లే అస్వస్థతకు కారణమని స్థానికులు చెబుతున్నారు. బాధితులకు కొండపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులు వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపుడుతున్నారు.
రెండు రోజుల క్రితం ఇదే లక్షణాలతో భీమయ్య (Bheemaiah) మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు భీమయ్య కూడా కుటుంబంలోని మరో ఇద్దరికి ఇవే లక్షణాలు కనిపించాయి. ఇక, కొండపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని.. జలమండలి సిబ్బంది చెప్పినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ వ్యక్తి ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు స్థానికులు చెబుతున్నట్టుగా నీరు కలుషితం కాలేదని జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం వడ్డర బస్తీలో పర్యటించిన జలమండలి అధికారులు.. నీటి, మురుగు కాలువలను తనిఖీ చేశారు. నీటి నమూనాలను సేకరించి.. కాలుష్య స్థాయిలను తనిఖీ చేయడానికి పంపించారు.
మరోవైపు వడ్డెర బస్తీలో ఇంటింటికి వెళ్లి రోగలక్షణ సర్వే చేయడం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. ‘‘మేము మూడు మూలాల నుంచి నీటి నమూనాలను సేకరించాం. రిజర్వాయర్ నుంచి, నీటి లైన్ల నుంచి, వినియోగదారుల ఇళ్ల నుంచి నీటి నమునాలను సేకరించి.. జీవ పరీక్షల కోసం Institute of Preventive Medicineకి పంపాం. వచ్చే 48 గంటల్లో ఫలితాలు వస్తాయి. అప్పుడే సరైన కారణం తెలుస్తుంది’’ అని జిల్లా జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ జనార్దన్ తెలిపారు.
ఇక, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి జలమండలి అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
