హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్ విశ్లేషించారు. ఆయన విశ్లేషణను ఎన్టీటీవీ మంగళవారంనాడు ప్రచురించింది. ప్రణయ్ రాయ్ విశ్లేషణ ప్రకారం - తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ప్రజా కూటమి జయాపజయాలను నిర్ణయించేది 2 శాతం ఓట్ల స్వింగ్ మాత్రమే. 

ప్రణయ్ రాయ్ విశ్లేషణ ఇలా సాగింది.... 2014లో లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ కు శాసనసభ ఎన్నికల్లో 33 శాతం ఓట్లు రాగా, లోకసభ ఎన్నికల్లో మాత్రం 35 శాతం ఓట్లు వచ్చాయి. లోకసభ ఎన్నికల్లో కన్నా టీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు శాసనసభ ఎన్నికల్లో తక్కువగా పోలయ్యాయి.

గత ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. శాసనసభ ఎన్నికల్లో బిజెపి 7 శాతం, లోకసభ ఎన్నికల్లో 10 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, శాసనసభ ఎన్నికల్లో బిజెపికి 3 శాతం ఓట్లు తక్కువగా పడ్డాయి. 

తెలుగుదేశం పార్టీకి శాసనసభ ఎన్నికల్లో 14 శాతం, లోకసభ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు పడ్డాయి. శాసనసభ ఎన్నికల్లో టీడీపికి 2 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. కాంగ్రెసుకు శాసనసభ ఎన్నికల్లో 24 శాతం ఓట్లు రాగా, లోకసభ ఎన్నికల్లో 25 శాతం ఓట్లు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో కన్నా లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసుకు 1 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి శాసనసభ ఎన్నికల్లో 3 శాతం ఓట్లు, లోకసభ ఎన్నికల్లో 4 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి ఆ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడదం లేదు. ఇతర పార్టీలకు, స్వతంత్రులకు శాసనసభ ఎన్నికల్లో 11 శాతం, లోకసభ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు పోలయ్యాయి.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్లు వచ్చాయి. అయితే, ఓట్లు ప్రధాన పార్టీల మధ్య చీలిపోయాయి. కాంగ్రెసు, బిజెపి - టీడీపిలు ఓట్లను చీల్చుకోవడంతో టీఆర్ఎస్ విజయం సాధించింది.

ఈ ప్రధాన శక్తులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తోంది. టీఆర్ఎస్ 33 శాతం ఓట్లతో 63 సీట్లను గెలుచుకున్నాడు. కాంగ్రెసు, సిపిఐ కలిసి 25 శాతం ఓట్లు సాధించి 22 సీట్లను గెలుచుకున్నాయి. టీడీపి, బిజెపిలకు కలిసి 21 శాతం ఓట్లు పొంది 20 సీట్లను సాధించాయి.

ఈ ఎన్నికల్లో టీడీపి, కాంగ్రెసు, సిపిఐ, జనసేన కలిసి ప్రజా కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాంగ్రెసు, టీడీపిలకు పోలైన ఓట్లను చూస్తే అది 38 శాతం ఉంది. వైఎస్సార్ కాంగ్రెసు టీడీపికి వ్యతిరేకం కాబట్టి ఆ పార్టీ ఓట్లు టీఆర్ఎస్ కు పడితే అది 36 శాతం అవుతుంది. 

ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో 20 శాతం ఓట్ల సగటు మార్జిన్ ను టీఆర్ఎస్ నమోదు చేసుకుంది. దక్షిణ తెలంగాణలో మాత్రం ఆ సగటు మార్జిన్ 11 శాతం మాత్రమే ఉంది. 

ఈ ఎన్నికల్లో పోటీ ఇలా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 ఏళ్లు పోరాడి సాధించిన కేసీఆర్ కు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన సోనియా గాంధీకి మధ్య పోటీగా ఈ ఎన్నికలను పరిగణించే అవకాశం ఉంది. 

టీఆర్ఎస్ నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు, అంత కన్నా ఎక్కువ ఇస్తామని కాంగ్రెసు ఇచ్చిన హామీకి మధ్య పోరాటం సాగుతోంది.