చిన జీయర్ స్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఎప్పుడో సమ్మక్క, సారలక్కలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చిన‌జీయ‌ర్ స్వామి. ఈ పేరు తెలియ‌ని తెలుగువారు లేరు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స‌న్నిహితుడ‌ని ఆయ‌న‌కు పేరుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చిన జీయర్ స్వామికి చాలా గౌరవం ఇస్తారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌ర స‌రిహ‌ద్దుల్లో స‌మ‌తామూర్తి విగ్ర‌హం నెల‌కొల్పి దేశ‌వ్యాప్తంగా కీర్తి సంపాదించారు. అయితే ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ చిన‌జీయ‌ర్ స్వామి వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ప్ర‌సంగాల సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వీటి ప‌ట్ల చాలా విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయ‌న మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. 

గ‌తంలో చిన‌జీయ‌ర్ స్వామి ఏదో ప్ర‌సంగం సంద‌ర్భంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇది చాలా పాత వీడియో. ఎక్క‌డ, ఏ సంద‌ర్భంలో ఆయ‌న ఈ విధంగా వ్యాఖ్యానించారో తెలియడం లేదు గానీ దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో చాలా మంది ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

తాజా వీడియోలో ఏముందంటే ? 
ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారిన చిన్ జీయ‌ర్ స్వామి ఆ వీడియోలో స‌మ్మ‌క సార‌ల‌క్క గురించి ప్ర‌స్తావించారు. వారు దేవ‌త‌లు కార‌ని చెప్పారు. అసలు స‌మ్మ‌క, సార‌ల‌మ్మ‌లు ఎవ‌ర‌ని అన్నారు. వారేం దేవ‌త‌లా అని తెలిపారు. బ్ర‌హ్మ లోకం నుంచి దిగొచ్చిన వారా ? అని అన్నారు. వారి చ‌రిత్ర ఏమిటి అని అడిగారు. వారు ఏదో గ్రామ దేవ‌త అని చెప్పారు. కానీ చ‌దువుకున్న వారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లు కూడా న‌మ్ముతున్నారని తెలిపారు. ఆ పేర్ల‌తో బ్యాంకులు కూడా పెట్టేశార‌ని అన్నారు. అది ప్ర‌స్తుతం వ్యాపారం అయిపోయింద‌ని చెప్పారు. 

ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన నాటి నుంచి చిన జీయ‌ర్ స్వామిని నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయ‌న ఆంధ్రాకు చెందిన స్వామిని, అందుకే తెలంగాణ వ‌న దేవ‌త‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌ని కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణలో స‌మ‌క్క సార‌ల‌క్క‌ను వ‌న దేవ‌త‌లుగా కొలుస్తామ‌ని, ఇక్క‌డ అంద‌రూ స‌మానమే అని చెబుతున్నారు. ఆ వీడియోను వాట్స‌ప్, ఫేస్ బుక్ స్టేట‌స్ లుగా షేర్ చేస్తూ వారి అభిప్రాయాన్ని జ‌త చేస్తున్నారు. చిన జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌పై ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌, సీపీఐ నేత నారాయ‌ణ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

గ‌తంలోనూ వివాదాస్పద వ్యాఖ్య‌లు..
చిన జీయ‌ర్ స్వామి గ‌తంలోనూ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. కులాలు ఉండాల‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ కుల వృత్తి నిర్వ‌హించాల‌ని చెప్పిన వీడియో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది. కొంద‌రు ప్ర‌గ‌తి శీల భావాలు ఉన్న కులాలు పోవాల‌ని అంటున్నార‌ని, కానీ అది త‌ప్పని ఆ వీడియోలో చెప్పారు. మ‌రో వీడియోలో మాంసాహారం తినొద్ద‌ని చెప్పారు. పంది మాంసం తింటే పందిలాగే ఆలోచిస్తార‌ని, మేక మాంసం తింటే మేక ఆలోచ‌న‌లే వ‌స్తాయ‌ని అందులో తెలిపారు. కోడి మాసం తింటే పెంట మీద ఏరుకుతినే ఆలోచ‌న‌లు వ‌స్తాయ‌ని అందులో చెప్పారు. ఈ వీడియో కూడా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొనేలా చేసింది. 

నాయ‌కుల ఆగ్ర‌హం.. 
స‌మ‌క్క సార‌ల‌క్కల‌పై చిన జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాయుకులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌, సీపీఐ నేత నారాయ‌ణ, బీఎస్పీ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా చిన జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. ఆదివాసీ స‌మ‌జానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో ఆదివాసీ నాయ‌కపోడు సంఘం నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.