ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. బుధవారం ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల వర్షాల పడతాయని ఐఎండీ తెలిపింది.  

కాగా, హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. చినుకుల‌తో మొద‌లై భారీ వ‌ర్షం కురిసింది. శివారు ప్రాంతాలైన జీడిమెట్ల, గాజులరామారం, దుండిగల్‌, కాప్రా, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, ఏఎస్‌రావు నగర్‌తోపాటు సైనిక్‌ పురి, నేరెడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి