Rain Updates: తెలుగు రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిందనీ, దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rain Updates: తెలుగు రాష్ట్రాలను వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తొలుత తెలంగాణ విషయానికి వస్తే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాగల మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారుగా వర్షాలు కురవగా.. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. రానున్న మూడు రోజుల్లో కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆగస్ట్ 25 నుంచి 28 వరకు మూడ్రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబరు 2 మధ్య కాస్త విరామం అనంతరం.. సెప్టెంబరు 3 తర్వాత కూడా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం తెలిపింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజుల్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.