తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.  రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అంతేకాదు దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది.

దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్టణం, క్రిష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్టోబరు 8 వరకు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

ఇప్పటికే ఇరురాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయింది. నీటి ప్రవాహంతో వాగులు, వంకలు, నదులన్నీ కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి.

రోజుల తరబడి నీళ్లు నిలవడంతో పంటపొలాలు దెబ్బతింటున్నాయి. ఇంకా పలు గ్రామాలు వరద నీటిలోనే మునిగిపోయాయి. ఐతే మరికొన్ని రోజుల పాటు ఈ వాన కష్టాలు తప్పేలా లేవు.