చేర్యాల: పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని తాను కబ్జా చేశానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. ఆరోపణలను రుజువు చేస్తే జనగామలలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్ చేశారు. చెరువు మత్తడి దూకినప్పుడు ఆ నీళ్లు రోడ్డు మీదికి రాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని ఐబీ అధికారులకు సూచించినట్లు తెలిపారు. 

జాతీయ రహదారి కావడంతో కిలోమీటరు పొడవునా కాలువ నిర్మాణానికి అనుమతి అసాధ్యమని చెప్పడంతోనే ఐబీ అధికారులు సర్వే చేశారని ఆయన చెప్పారు. చెరువు చెంతనే ఉన్న పట్టా స్థలం నుంచి నీళ్లుపోతున్నాయని, కాలువ నిర్మాణానికి 10 గుంటల స్థలం ఇవ్వాలని సదరు యజమానిని కోరితే తిరస్కరించారని, మొత్తం కొంటేనే ఇస్తాన్ని చెప్పడంతో తన కూతురు, బంధువులు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. తనను నమ్ముకున్న పట్టణ ప్రజల ప్రయోజనం కోసం కాలువ నిర్మాణానికి ఆ పట్టా భూమి నుంచి వేయి గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చామని చెప్పారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని భూకబ్జా ఆరోపణలు చుట్టుముట్టిన విషం తెలిసిందే. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమంగా భూఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు శుక్రవారం చేర్యాల బంద్ చేపట్టాయి. ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి 20 గుంటల స్థలాన్ని ఆక్రమించుకున్నారని, బినామీలతో భూఅక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. 

కాంగ్రెసు, బిజెపి, సీపీఎం, సీపీఐ, న్యూడెమొక్రసీ, రెవెన్యూ డివిజన్ జేఎసీ, ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ మాలమహానాడులకు చెందిన నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. మత్తడి ప్రవాహ పరిధిలో ముత్తిరెడ్డి ఆక్రమణలకు పాల్పాడ్డారని ఆరోపిస్తూ స్థలం వైపు ర్యాలీకి వెళ్లి అక్కడ నిర్మించిన ప్రహారీ గోడను కూల్చేశారు. 

అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకారులకు వాగ్వివాదం జరిగింది. కాసేపు తోపులాట కూడా జరిగింది. దీంతో ఉద్రిక్త వాతారవణం చోటు చేసుకుంది.

సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి ప్రాంగణంలోని సర్వే నెంబర్ 1402లో అర ఎకరం పట్టా భూమి ఉంది. చాలా కాలంగా ఖాళీగా పడి ఉండడంతో అక్కడ పశువుల సంత నిర్వహిస్తూ వస్తున్నారు. లారీ యజమానులు తమ వాహనాలను నిలుపుకునేవారు. కొందరు చిన్నపాటి దుకాణాలను కూడా ఏర్పాటు చేస్కున్నారు. 

2013లో ఆ పట్టాదారులు అజీజ్ అహ్మనూర్ కుటుంబ సభ్యులు, వసీమ్ ఖాన్, కృష్ణారెడ్డికి విక్రయించారు. ఆ స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 

ఆ భూమిని గత జనవరిలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి, బంధువులు మారుతీ ప్రసాద్, జితేందర్ రెడ్డి కొన్నారు. ఇటీవల తపాస్ పల్లి రిజర్యాయర్ నుచి గోదావరి నీటిని విడుదల చేయడంతో రెండు మూడు రోజులు చెరువు అలుగు పోసింది. ఆ వరద మత్తడికి పక్కనే ఉన్న ప్రధాన రహదారి మీదుగా ప్రవహించింది. దాంతో అక్కడి ప్రజలు, రోడ్డు పక్కన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాంతో ఆ వరదను మళ్లించాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆలోచించి, పెద్ద చెరువు నుంచి అలుగు పోసో ఆ నీటిని కాలువ ద్వారా సమీపంలోని ఉన్న కుడి చెరువుకు తరలించడానికి పూనుకున్నారు. 

మత్తడి నుచి నేరుగా కాలువ నిర్మిస్తే తన కూతురు కొన్న స్థలం మొత్తం కాలువకు వదలాల్సి వస్తుందనే ఉ్దదేశంతో కాస్తా పక్కకు జరిపి కేవలం వేయి గజాల స్థలం మాత్రమే కోల్పోయే విధంగా ముత్తిరెడ్డి కాలువను డిజైన్ చేయించారని ఆరోపిస్తున్నారు. మత్తడి ప్రవాహం నీటి మళ్లింపును చెరువు కట్టను ఆనుకుని చేపడుతున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 

చెరువు కట్టను ఆనుకుని కాకుండా ముత్తిరెడ్డి ఆక్రమించిన 20 గుంటల స్థలం మధ్య నుంచి దాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకరు, లోకాయుక్తకు ఆ విషయంపై ఫిర్యాదు చేశారు.