పీఎం కీసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది. ప్రతీ ఒక్క రైతు ఈ- కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. పీఎం కిసాన్ నిధి అధికారికి వెబ్ సైట్ లోకి వెళ్లి లేదా మీసేవా, సీఎస్ సీ సెంటర్లలో దీనిని పూర్తి చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్టే కేంద్ర ప్రభుత్వం కూాడా రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏడాదికి రూ.6 వేల సాయం చేస్తోంది. ఎకరానికి ఇంత చొప్పున అని కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా.. రూ.6 వేలు అందిస్తుంది. దీనిని మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేస్తోంది. ఇది చాలా మంది రైతులకు ఉపయోగకరంగా ఉంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం రైతులందరూ ఈ- కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పొందేందుకు అర్హులు.
కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు 9 విడతలుగా డబ్బులు జమ చేసింది. మరి కొన్ని రోజుల్లో పదో విడత డబ్బులను జమ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులందరూ ఈ - కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇది పూర్తి చేసుకుంటేనే రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తామని చెబుతోంది.
కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు : కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ
ఎలా చేసుకోవాలి..
సాధారణంగా ఇది రైతులే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా రైతుల ఆధార్ కార్డులకు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. కొంత సాంకేతికత తెలిసిన రైతులు లేదా ఇతరుల సాయంతో దీనీని ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగానే చేసుకోవచ్చు. ముందుగా ప్రధానమంత్రి కిసాన సమ్మాన్ నిధికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి. అందులోకి వెళ్లగానే ఎడమవైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ కార్నర్ కింద మొదటి ఆప్షన్ గా ఉండే ఈ- కేవైసీ న్యూ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత అందులో రెండు బాక్స్‌లు కనిపిస్తాయి. మొదటి బాక్స్‌లో రైతు ఆధార్ కార్డు నెంబర్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత రెండో బాక్స్‌లో పక్కనే కనిపించే క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత మళ్లీ ఒక కొత్త బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత ‘GET OTP’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైతుల మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. దాని వ్యాలిడిటీ పది నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో ఓటీపీ నెంబర్లను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. దీంతో కిసాన్ సమ్మాన్ నిధి ఖాతాతో మీ ఆధార్ కార్డు లింక్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఈ- కేవైసీ పూర్తి అవుతుంది. దీంతో నిరాటంకంగా పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్‌లో పడిపోతాయి. మొబైల్ నెంబర్ లింక్ లేని రైతులు కూడా దగ్గరలోని మీసేవా సెంటర్లలో, లేదా సీఎస్‌సీ సెంటర్లలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. వారి వద్ద ఉన్న బయోమెట్రిక్ పరికరాల ఆధారంగా రైతుల ఈ - కేవైసీని వారు పూర్తి చేస్తారు.
