డీవోపీటీ ఆదేశాలు.. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్న సోమేశ్ కుమార్.. !
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి.. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి.. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసేందుకు సిద్దమయ్యారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సోమేష్ కుమార్.. రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.
ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్‌గా ఉన్నారు.
ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ 2014లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ తీర్పు ఇచ్చింది. అయితే క్యాట్ ఆర్డర్‌ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ 2016 మార్చిలో తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. డీవోపీటీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
సోమేశ్ కుమార్‌ను తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. కేటాయింపు జాబితాలో జోక్యం చేసుకోవడం ద్వారా క్యాట్ తప్పు చేసిందని అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు వెలువడిని కొన్ని గంటలకు.. సోమేష్ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. ఈ నెల 12లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నారనే కథనాలు వెలువడినప్పటికీ.. తాజాగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.