దేశవ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న సమయంలోనే రాష్ట్రానికి చెందిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ఫయం తీసుకుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితోనే ఈ పదోన్నతులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 

తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్న 48 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లు వున్నట్లు తెలిపింది. ఈ పదోన్నతులకు సంబంధించి మొత్తం 15 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది.

26 ఐఏఎస్ లలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. వీరితో పాటే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు.  అలాగే ఒకరికి ముఖ్య కార్యదర్శి, 4 గురికి కార్యదర్శి, 6 గురికి అదనపు కార్యదర్శులుగా, 5 గురికి సంయుక్త కార్యదర్శులుగా, మరో నలుగురికి డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇక 23 మంది ఐపీఎస్‌లలో ఐదుగురికి అదనపు డీజీలుగా ప్రమోషన్ లభించింది.  నలుగురు ఐపీఎస్ లకు ఐజి, ఏడుగురు ఐపీఎస్ లకు డీఐజీ, ఆరుగురు ఐపీఎస్ లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి కూడా ఐజి‌గా పదోన్నతి లభిచింది.