మహబూబ్‌నగర్: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు  ఓటర్లకు  హామీల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామపంచాయితీ సర్పంచ్‌గా పోటీలో ఉన్నఅభ్యర్థి పదవిలో ఉన్నంత కాలం పెళ్లి కానుకను ఇస్తానని ఓటర్లకు హామీలు కురిపించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉండవల్లి  గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవికి  రేఖ వెంకటశ్వరగౌడ్  పోటీ  చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఎవరైనా అమ్మాయి వివాహం చేసుకొంటే తాను సర్పంచ్‌గా పదవిలో ఉన్నంత కాలం రూ.5,016లను అందిస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మీ పథకం కింద  దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలు వివాహం చేసుకొంటే రూ.లక్ష నగదును సహాయంగా అందిస్తోంది. అయితే ఈ సహాయం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తించనుంది. అయితే  గ్రామంలో 3700 మంది ఓటర్లున్నారు. ఈ 9500 మంది జనాభా నివాసం ఉంటున్నారు. 

గ్రామంలో పెళ్లి చేసుకొనే అమ్మాయిలకు తన స్వంత డబ్బులను రూ.5016 చెల్లించనున్నట్టు రేఖ వెంకటేశ్వరగౌడ్ ప్రకటించారు. ఈ గ్రామానికి రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు రేఖను కరుణిస్తారో లేదో మరికొన్ని గంటల్లో తేలనుంది.