హైదరాబాద్:   వచ్చే ఎన్నికల్లో తాను మహేశ్వరం నుండి పోటీ చేస్తానని  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.  2019 ఎన్నికల్లో తాను మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. తన కొడుకు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారని చెప్పారు.

గత ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో తల్లి, కొడుకులు ఇద్దరూ కూడ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.

చేవేళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీలకు రిజర్వ్  చేయడంతో  సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుండి 2009లో పోటీ చేశారు. 2009 లో ఆమె ఈ స్థానం నుండి విజయం సాధించారు.

గత ఎన్నికల్లో ఈ స్థానంలో మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో  తాను  మహేశ్వరం నుండి పోటీ చేస్తానని ఆమె చెప్పారు.  కార్తీక్ తొలిసారిగా రాజేంద్రనగర్ నుండి పోటీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.