హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం హైద్రాబాద్ ‌ గాంధీ భవన్ ‌లో జరిగింది.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్ సీ కుంతియాతో పాటు  కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎఐసీసీ కార్యదర్శులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు,రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  ఫలితాలపై చర్చించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టుగా  టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేతలు హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన కారణాలపై చర్చించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం కొంత సన్నగిల్లిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఓటింగ్ ను ఈ నియోజకవర్గంలో నిలుపుకొనే ప్రయత్నం చేసిన విషయాన్నిఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

Also Read:హుజూర్ నగర్ కృతజ్ఞతసభ: సీఎం కేసీఆర్ వరాలజల్లు

 పార్టీకి నష్టం కలగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన ఖర్చును తట్టుకోలేకపోయామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు 

పార్టీలో  కొందరు నేతలు క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడడం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనుచరులు  రేవంత్ రెడ్డిని సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడాన్ని వి. హనుమంతరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read:ఏడడుగుల మంత్రి ఏం చేయలేదు, మా మూడడుగుల బుల్లెట్ నీళ్లు తెచ్చాడు: జగదీష్ రెడ్డిపై కేసీఆర్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఎక్కడైనా ప్రచారానికి వెళ్లిన సమయంలో  సీఎం అంటూ నినాదాలు చేయించుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సరిగా లేదని హనుమంతరావు  అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నెల 21వ తేదీన  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధి పద్మావతి ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 43 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.