నాకు ఈడీ నోటీసులు ఇవ్వలేదు, తప్పుడు ప్రచారం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.
హైదరాబాద్: తనకు ఈడీ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈడీ నుండి తనకు నోటీసులు అందినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని కల్వకుంట్ల కవిత ప్రకటించారు.ఢిల్లిలో కూర్చుని మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. వాస్తవాలు చెప్పేందుకు సమయాన్ని కేటాయించాలని మీడియా సంస్థలను కవిత కోరారు. తనకు ఈడీ నుండి నోటీసులు రాలేదని ఆమె ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కరోనాతో ఎమ్మెల్సీ కవిత క్వారంటైన్ లో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆప్ తో పాటు టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ టీఆర్ఎస్ కు చెందిన కొందరిపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కూడా తెలంగాణలో అధికారపార్టీసై విమర్శల దాడిని తీవ్రం చేశారు. ఈ విషయమై కల్వకుంట్ల కవిత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన వారిపై కవిత పరువు నష్టం దావా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఇవాళ దేశంలోని 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నారు.
హైద్రాబాద్ లోని ఓ బ్యూటీపార్లర్ సంస్థలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ బ్యూటీ పార్లర్ కార్పోరేటర్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారని ఈ చానెల్ కథనం ప్రసారం చేసింది.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: 12 మంది సహ 18 కంపెనీలకు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై 12 మంది సహ 18 కంపెనీలకు ఇవాళ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో భాగంగా క్వారంటైన్ లో ఉన్న కవితకు నోటీసులు ఇచ్చారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని కవిత స్పష్టం చేశారు.