హైద్రాబాద్‌ని నెహ్రు జూలాజికల్ పార్క్‌లోని 8 సింహాలకు కరోనా నిర్ధారణ అయింది. దేశంలో తొలిసారిగా  కరోనా సోకిందని అధికారులు తెలిపారు.హైద్రాబాద్ లోని నెహ్రు జూలాజికల్ పార్క్ లో ఉన్న సింహాలు కొన్ని రోజులు అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో వీటి శాంపిళ్లను  జూపార్క్ అధికారులు సీసీఎంబీకి  పంపారు.  ఈ ఎనిమిది సింహాలకు కరోనా సోకిందని సీసీఎంబీ తేల్చింది.

 

ఏప్రిల్ చివరి వారంలో ఈ 8 సింహాల్లో కరోనా లక్షణాలు జూ లో పనిచేసే పశుసంవర్ధక శాఖ వైద్యులు గుర్తించారు. ఈ పార్క్ లో ప్రస్తుతం 12 సింహాలున్నాయి. ప్రస్తుతం 8 సింహాలకు దగ్గు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలను పరిశీలించినట్టుగా వైద్యులు చెప్పారు. దీంతో సింహాల నుండి శాంపిళ్లను తీశారు.  ఈ శాంపిళ్లను  సీసీఎంబీకి పంపారు. ఈ రిపోర్టు ఇవాళ వచ్చింది. 

also read:హైద్రాబాద్‌లో 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు: సీసీఎంబీకి శాంపిల్స్

కరోనా కేసుల తీవ్రత పెరిగిన దృష్ట్యా నెహ్రు జులాజికల్ పార్క్ ను ఈ నెల 1వ తేదీ నుండి మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సందర్శకులకు ఈ పార్క్ లో కి అనుమతిని నిషేధించారు. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో  దేశంలోని అన్ని పార్క్ లను మూసివేయాలని వాతావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెహ్రు జులాజికల్ పార్క్ మూసివేశారు.రాష్ట్రంలోని వరంగల్ లోని కాకతీయ జులాజికల్ పార్క్, కవ్వాల్ , ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ లలోకి సందర్శకులకు అనుమతిని నిలిపివేశారు.